విగ్రహాల ధ్వంసం జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు

  • వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీపై వేయాలనుకున్నారన్న ఆంజనేయులు
  • కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే జగన్ లక్ష్యమని విమర్శ
  • బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణ

రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాల వెనుక వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.


నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ... విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీ నేతలపై వేయాలని వైసీపీ ప్లాన్ చేసిందని, అయితే తీరా విచారణలో ఆ పని చేసింది వైసీపీ కార్యకర్తేనని తేలడంతో ఆ పార్టీ నేతలు మిన్నకుండిపోయారని ఎద్దేవా చేశారు. కావాలనే కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందడమే జగన్ ఏకైక ఉద్దేశమని మండిపడ్డారు.


వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని కబ్జా చేయడానికి దొంగ జీఓలను సృష్టించి, దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని తెలిపారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని రెండెకరాల భూమిని సైతం వైసీపీ నేతలు కబ్జా చేశారని, ఈ భూదందాలో జగన్‌కు, మోహన్ రెడ్డికి కూడా వాటాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై వారు ఎంత వాటా తీసుకున్నారో తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


టీడీపీలో ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే పార్టీ నుంచి వెంటనే బహిష్కరిస్తామని, కానీ వైసీపీలో మాత్రం అవినీతిపరులకే పెద్దపీట వేస్తారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, జగన్ తన నేరాలను ఇతరులపై మోపి విషప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


GV Anjaneyulu
YCP
TDP
Andhra Pradesh
Idol vandalism
YS Jagan
Land scams
Bolla Brahmanaidu
Vinukonda
Political conspiracy

More Telugu News